Banswada News
పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి.
Quick Summary:
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి - ఎమ్మెల్యే పోచారం
5 టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : బాన్సువాడ పట్టణ కేంద్రంలోని పాత బాన్సువాడ పల్లె దవాఖానను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన, వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడి అందుతున్న చికిత్సపై వివరాలు తెలుసుకున్నారు.అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశమైన ఎమ్మెల్యే, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అవసరమైన మందులు, వైద్య పరికరాలు, ఇతర సదుపాయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.వర్షాకాలంలో డెంగ్యూ, వైరల్ జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందేలా సమన్వయంతో పనిచేయాలని వైద్య సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.